text: భారత దేశ నిర్మాణం నాలుగు మూలస్తంభాలపై ఆధారపడి జరగాలి అని మహారాష్ట్రకు చెందిన గొప్ప మేధావి, ఆలోచనాపరుడు మహాదేవ్ గోవింద్ రానడే (1842-1901) చెప్పారు. అవి రైతుల సాధికారత, మహిళల సాధికారత, అందరికీ విద్య, బలమైన సాంఘిక సంస్కరణలు. “రానడే నిజాయతీపరుడు, మేధావి, లాయర్, జడ్జి, మంచి ఆర్థికవేత్త, చరిత్రకారుడు, విద్యావేత్త, అపూర్వమైన వ్యక్తి“ అని అంబేద్కర్ 1942 లో రానడే శతజయంతి సందర్భంగా కొనియాడారు. ఆర్య సమాజ్ నిర్మాత దయానంద సరస్వతి 1875లో పుణె వచ్చినప్పుడు కొందరు ఆయనపై దాడి చేశారు. అప్పుడు రానడే, జ్యోతీరావ్ ఫూలే ఆయనకి రక్షణగా ఉంటూ ఆ దాడిని అడ్డుకున్నారు. 1880 తరువాత రానడే సీనియర్ జడ్జ్‌గా ఉంటూ... కోల్హాపుర్ మహారాజుకు మద్దతు ఇవ్వడం (1901), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు దిశానిర్దేశం చెయ్యడం (1885), దక్కన్ సభ స్థాపన మొదలైన వ్యవహారాలలో పాల్గొనడం, పన్నుల మిహాయింపు విషయంలో ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరపడం వంటివి బహిరంగంగా చేయడం సాధ్యపడలేదు. ఈ అంశాల గురించి ఆయన ఇంట్లోనే చర్చలు నడిపేవారు. ఆయన అనుచరులు గోపాలా కృష్ణ గోఖలే, విష్ణు మోరేస్వర్ భైడ్, ఆర్.జీ బండార్కర్ మొదలైనవారంతా రానడే ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేవారు. రానడేను, ఆయన అనుచరులను బాల గంగాధర్ తిలక్ (1856-1920) తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు విరుద్ధమైన అంశాలపై స్పందిస్తూ తిలక్ జర్నలిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించారు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను సమర్థిస్తూ బ్రిటిష్ ప్రెస్‌లో వ్యాసాలు రాసారు. నిరుపేద రైతులకు సహాయంగా తీసుకొచ్చిన దక్కన్ అగ్రికల్చరిస్ట్స్ యాక్ట్‌పై విమర్శలు గుప్పించారు. కుల వ్యవస్థను సమర్థించారు. ఈ మూడు అంశాల ద్వారా తిలక్ భావజాలాన్ని అర్థం చేసుకోవచ్చు. 1884 లో ఎం.జీ.రానడే స్థాపించిన మొట్టమొదటి బాలికోన్నత పాఠశాలను (హుజూర్ పాగా), ది యాక్ట్ ఆఫ్ కన్సెంట్ బిల్లును వ్యతిరేకిస్తూ తిలక్ తన పురుషస్వామ్య భావాలను బయటపెట్టారు. ద మహరట్టా కార్పొరేట్ పత్రిక కాదు. 1881-1897 వరకూ ఆ పత్రికకు తిలక్ ఏకైక యజమాని, సంపాదకుడుగా వ్యవహరించారు. తరువాత ఆయన మరణించేవరకు ఎన్.సి.కేల్కర్‌తో కలిసి సంపాదకీయం చేశారు. దక్కన్ అగ్రికల్చరిస్ట్స్ రిలీఫ్ బిల్లును 1874-79 కరువు కాలంలో కష్టాల్లో ఉన్న రైతులకు సహాయపడేందుకుగానూ ఎం.జీ రానడే, విలియం వెడ్డర్‌బర్న్ కలిసి రూపొందించారు. కరువు కాలంలో తమని దోచుకుంటున్న జమీందార్లు, వడ్డీ వ్యాపారులపై రైతులు తిరుగుబాటు చేశారు. వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన తన అనుచరులు దౌలతీయ రామోషీ, బాబాజీ చమ్హార్, సఖారాం మహర్, కొండు మంగ్‌లు కూడా ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఫాడ్కే తిరుగుబాటును తిలక్ తీవ్రంగా విమర్శించారు. ఇది "ఒక తప్పుదారి పట్టిన వ్యక్తి చేసిన వెంట్రుకవాసి ప్రయత్నం" అని విమర్శించారు. ఫాడ్కే దోపీడీ దొంగల ముఠాను తయారుచేస్తున్నారని కూడా తిలక్ ఆరోపించారు. ప్రభుత్వం ఫాడ్కేను అరేస్ట్ చేసి అడెన్ జైల్లో ఉంచింది. అదే జైల్లో 1883లో ఫాడ్కే మరణించారు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను సమర్థిస్తూ బ్రిటిష్ ప్రెస్‌లో వ్యాసాలు రాసారు భవిష్యత్తులో ఇలాంటి వ్యవసాయ సంబంధిత సంక్షోభాలు తలెత్తకుండా ఉండేందుకు అగ్రికల్చర్ (షేత్కారీ) బ్యాంకులను స్థాపించాలని రానడే, వెడ్డర్‌బర్న్ కలిసి ప్రతిపాదించారు. రైతులకు తక్కువ వడ్డీలకు రుణాలు ఇస్తూ, చెల్లింపుల వెసులుబాటుని కల్పించేలా ఈ బ్యాంకు విధులను రూపొందించాలని ప్రతిపాదించారు. తిలక్ ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. వడ్డీలిచ్చే భూస్వాములను ‘రైతుల పాలిట దేవతలు’గా అభివర్ణించారు. రుణాలు సకాలంలో చెల్లించని రైతులను అరెస్ట్ చేసే చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. 1885లో ప్రభుత్వం షేత్కారీ బ్యాంకుల ప్రతిపాదనను తిరస్కరించింది. ఇది తిలక్ మొదటి గెలుపు. మహరాష్ట్ర రైతుల పట్ల తిలక్ వైఖిరి చివరివరకూ ఇదే విధంగా కొనసాగింది. 1897లో కరువుకాటకాలు వచ్చినప్పుడు దక్కన్ సభతో కలిసి గోపా కృష్ణ గోఖలే ప్రభుత్వంతో చర్చలు జరిపి రూ.48.2 లక్షల ధన సహాయం, రూ.64.2 లక్షల రుణ మాఫీలు మంజూరు చేయించారు. తిలక్ దక్కన్ సభను ‘వట్టిపోయిన పశువుల కొట్టం’ అని వ్యాఖ్యానించారు. ర్యోత్వారీ భూముల్లో పన్నులు విధించకకూడదని, జమీందార్లకు పన్నుల మినహాయింపు ఇవ్వాలని ప్రచారం చేపట్టారు. తిలక్ రైతులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, కుల వ్యవస్థకు మద్దతు ఇవ్వడం రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. ఈ రెండు అంశాల పట్ల తిలక్ వైఖరి చివరివరకూ ఇలాగే కొనసాగింది. "రైతు బిడ్డలకు చదవడం, రాయడం నేర్పించడం... చరిత్ర, భూగోళ శాస్త్రం, గణితం భోదించడం అనవసరం. ఆచరణలో వారికి అవెందుకూ ఉపయోగపడవు. అవి వారికి మంచి చెయ్యవు సరి కదా, చేటు చేస్తాయి. బ్రాహ్మణేతరులకు వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, దర్జీ పనులు నేర్పించడం ఉత్తమం. అవి వారి జీవితాలకు స్థిరత్వాన్ని చేకూర్చుతాయి" అనే అభిప్రాయాన్ని తిలక్ పలుమార్లు వ్యక్తం చేసారు. తిలక్ దీన్ని ‘హేతుబద్ధమైన విద్యావ్యవస్థ’ గా పిలిచారు. 1881లో ప్రతీ గ్రామంలోనూ 200 మందికి విద్య అందించగలిగేలా ప్రభుత్వ పాఠశాలలను నెలకొల్పాలని పుణె సార్వజనిక సభ ప్రతిపాదించింది. అయితే, 'రైతుల పిల్లలకు చదువు చెప్పడం డబ్బు దండగ పని' అంటూ తిలక్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. రాష్ట్రంలో అందరికి సమానంగా విద్య అందాలని పట్టుబట్టిన రానడే ఆలోచనలను తిలక్ పూర్తిగా వ్యతిరేకించారు. ‘‘ప్రజాధనం అంటే పన్ను చెల్లిస్తున్నవారి డబ్బు. దాన్ని ఎలా వినియోగించాలో చెప్పే హక్కు వారికి మాత్రమే ఉంది’’ అని వాదించారు. బ్రాహ్మణేతరులు బాంబే విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించడానికి అనుకూలంగా ప్రవేశ పరీక్షలను సరళీకృతం చేయాలన్న రానడే ఆలోచనలను కూడా తిలక్ విమర్శించారు. ఇంగ్లిష్ విద్యా విధానాన్ని సమర్థించారు. ఇంగ్లిష్ విద్య ప్రవేశించకముందు మనమంతా అజ్ఞానులుగా ఉన్నామని, ఆ విద్య భూములున్న ధనిక బ్రాహ్మణులకు మాత్రమే దక్కాలని తిలక్ ఆశించారు. పేద బ్రాహ్మణులను కూడా ఆయన లెక్కలోకి తీసుకోలేదు. తిలక్ వ్యాఖ్యలు బ్రాహ్మణేతరులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. 1891 లో తిలక్ కుల వ్యవస్థను దేశానికి మూలస్తంభంగా అభివర్ణించారు. మన సులువు కోసమే అసమానతలు ఉండాలని సూచించారు. బ్రాహ్మణులకు మాత్రమే విద్య అందాలని, లేదంటే బ్రాహ్మణులకు, బ్రాహ్మణేతరుకు తేడా గుర్తించలేమని అన్నారు. ‘తిరుగుబాటుతనం అనేది అప్రాచ్యం’ అని అన్నారు. ‘కులం, కులానికి మాత్రమే ఉన్న బలం’ అని రాసిన ఓ సంపాదకీయంలో ‘కులమనేదే లేకపోతే ఈ హిందూ దేశం ఎప్పుడో అంతరించిపోయుండేది’ అని తిలక్ అభిప్రాయపడ్డారు. రానడేలాంటి సంస్కర్తలు ‘కులాన్ని, దానితోపాటే ఈ దేశ జీవశక్తిని చంపాలని’ చూస్తున్నారు అని తిలక్ అన్నారు. ‘లౌకిక విద్య (సెక్యులర్ ఎడ్యుకేషన్) ఒక శూన్యవాదమని’ అన్నారు. స్కూళ్లల్లో మత విశ్వాసాలను ప్రబోధించే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని, దేవుడు ఉన్నాడని విద్యార్థులు బలంగా నమ్మాలని, దేవుడి ఉనికిని ప్రశ్నించే విద్యార్థి గొంతు మూసేయాలని తిలక్ అన్నారు. బ్రిటిష్ పాలనలో చాతుర్వర్ణ వ్యవస్థ నాశనమైపోయిందని, దాన్ని నిలబెట్టడానికి మనకు స్వపరిపాలన ఉండాలని తిలక్ నొక్కిచెప్పారు. జంఖండి లాంటి బ్రాహ్మణేతర అధికారులను దుయ్యబట్టారు. కోల్హాపూర్ మహరాజును 'మతి లేనివాడిగా' వ్యాఖ్యానించారు. ఆది శంకరాచార్యులను కూడా తిలక్ విడిచిపెట్టలేదు. స్త్రీ విద్యను కూడా తిలక్ తీవ్రంగా వ్యతిరేకించారు. రానడే స్త్రీ విద్య దేశాభివృద్ధికి సంకేతమని సూచించారు. పుణెలో బాలికోన్నత్త పాఠశాలను నిర్మించారు. అందులో కుంబి, సోనార్, యూదులు, క్రిస్టియన్లు ఇలా పిల్లలందరికీ చదువుకునే అవకాశం కల్పించారు. దీనిపై తిలక్ విమర్శలు గుప్పించారు. ఇంగ్లిష్ విద్య స్త్రీలలో స్త్రీత్వాన్ని నశింపజేస్తుందని, వారిని సంతోషకరమైన ప్రాపంచిక జీవితానికి దూరం చేస్తుందని అన్నారు. రఖ్మాభాయ్ విద్యావంతురాలైన యువతి స్త్రీలకు స్థానిక పనులు, నీతి సూత్రాలు, కుట్టుపని నేర్పిస్తే చాలని తిలక్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఆడపిల్లలు పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ స్కూలుకెళితే ఇంట్లో పని చెయ్యలేరని, రోజులో మూడు గంటలు మాత్రమే విద్యా బోధన జరగాలని, మిగతా సమయంలో స్త్రీలు ఇంటిపనులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ పద్ధతులకు అనుగుణంగా రానడే స్థాపించిన స్కూల్‌లో విద్యావిధానాన్ని వెంటనే మార్చాలని, లేదంటే ఆడపిల్లలందరూ భర్తను విడిచిపెట్టిన రఖ్మాభాయ్‌లా తయారవుతారని హెచ్చరించారు. రఖ్మాభాయ్ విద్యావంతురాలైన యువతి. తన భర్త దాదాజీ భికాజీ దురలవాట్లకు బానిస అని, ఆయనతో కాపురం చేయలేనని ఖరాఖండిగా చెప్పిన మహిళ. అప్పట్లో అది ఒక గృహ హింస కేసు. అయితే, ఈ ఉదంతం ‘హిందూ జాతికే మచ్చ’ అని తిలక్ వ్యాఖ్యానించారు. దాదాజీకి మద్దతుగా తమ పత్రికలో ఆరు పేజీలు కేటాయించారు. భర్తతో కాపురం చేయకపోతే రఖ్మాభాయ్‌ని జైల్లో పెట్టాలని వాదించారు. రఖ్మాభాయి, సరస్వతిభాయి (పండిత రమాభాయి) లాంటివారందరినీ దొంగతనం, వ్యభిచారం, హత్యలాంటి వాటికి విధించే కఠినమైన శిక్షలను విధించాలని అన్నారు. రఖ్మాభాయి కేసుతో, ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్లు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. వివాహ వయసుని 10 నుంచి 12కు పెంచాలని బీ.ఎం. మలబారీ ప్రతిపాదించారు. తిలక్ దీన్ని ఖండించారు. జీ.జీ అగార్కర్, రానడే, గోఖలే వంటి సంస్కర్తలందరిపై మాటల దాడి చేశారు. ఇవే కాకుండా ఇంకా బయటకు చెప్పలేని అనేక తీవ్రమైన వ్యాఖ్యానాలు చేశారు. 1890 లో ఫుల్మోనీ అనే పదేళ్ల బాలికను, 30 ఏళ్ల హరి మైతీకిచ్చి వివాహం చేశారు. సంభోగ సమయంలో ఆమె మరణించింది. ‘‘హరి మైతీ ఇప్పటికే భార్యను కోల్పోయి బాధలో ఉన్నారని, అతని మీద విమర్శలు గుప్పించకూడదని, రాష్ట్ర ప్రజలు సంయమనం పాటించాలని’’ తిలక్ సలహా ఇచ్చారు. కానీ ఈ దుఃఖాంతం అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా కలవరపెట్టింది. దాంతో 1891లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్లు పాస్ చేశారు. 1900ల తరువాత జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాక తిలక్ వైఖరి మారిందనుకునేందుకు కూడా సాక్ష్యాలు లేవు. బ్రిటిష్ ప్రభుత్వం రైతుపై జమీందార్ల పెత్తనాన్ని తగ్గించిందని ఆయన ఎప్పుడూ విమర్శించేవారు. రైతుల సాధికారతను జీవితాంతం వ్యతిరేకిస్తూనే ఉన్నారు. 1915లో పుణెలో డీ.కే. కార్వే మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినప్పుడు, ‘‘సగటు హిందూ స్త్రీ ఒక భార్యగా, కోడలిగా... భర్తకు, భర్త ఇంటివారికీ విధేయురాలై ఉండాలి. వంట, గృహ వ్యవహారాలు, పిల్లల పెంపకం, పోషణకు తగ్గ కోర్సులను మాత్రమే యూనివర్సిటీలో బోధించాలి’’ అని తిలక్ కార్వేకు సూచించారు. తిలక్, ఆయన అనుచరులు స్త్రీలకు తప్పనిసరి ఉచిత విద్యను గట్టిగా వ్యతిరేకించారు. ఓ పక్క తిలక్ ఈ రకమైన వ్యాఖ్యలన్నీ చేస్తూనే, మరోపక్క బ్రిటన్‌లో ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. లెనిన్ సిద్ధాంతాలను ప్రశంశిస్తూ రష్యా తిరుగుబాటుకు మద్దతిచ్చారు. సోవియట్, ఇండియా మార్క్సిస్టులందరూ తిలక్‌ను గొప్ప స్వాతంత్ర్యోద్యమ నాయకుడిగా కొనియాడుతూ, నిజమైన సంస్కర్తలైన రానడే, గోఖలేలాంటివారందరినీ మితవాదులంటూ కొట్టిపారేశారు. తిలక్ పురుషస్వామ్య, భూస్వామ్య వాదాలన్నిటినీ విస్మరిస్తూ... ఆయన జైలుకెళ్లిన సంగతి, 1908లో టెక్స్టైల్ మిల్లు సమ్మెను మాత్రమే ప్రస్తావించారు. 1880లో ఉత్సాహవంతంగా వెలుగుతున్న మహారాష్ట్రను... 1920 కల్లా పూర్తిగా విచ్చిన్నం చెయ్యడంలో తిలక్ విజయం సాధించారు. వంద సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. కుల వివక్ష, మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉన్నాయి. వలసరాజ్య పాలన వల్లే తిలక్ వైఖరి ఇలా ఉందని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ఒక దేశం పటిష్ఠంగా ఉండాలంటే విభిన్న సమూహాలను కలుపుకుంటూ పోవాలి. | |