text: జెరె చేసిన నేరమల్లా... బ్రా వేసుకుని పాట పాడడమే. కేవలం 19 ఏళ్ల వయసున్న జెరె ఒక్క పాటతోనే స్టార్‌డమ్ సంపాదించుకుంది. అయితే, ఆమె ధరించిన దుస్తులపై సంప్రదాయవాదులు మండిపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆమెకు బెదిరింపులు పెరిగిపోయాయి. కొందరైతే ఏకంగా ఆమెను చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. 1991లో సోవియట్ రష్యా కూలిపోయినపుడు కిర్గిస్థాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. సుమారు 60 లక్షల జనాభా ఉన్న కిర్గిస్తాన్‌లో ముస్లింలు ఎక్కువ. స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన నాటి నుంచి దేశంలోని ప్రజలు ఇతర ముస్లిం దేశాల సంప్రదాయాలను అనుసరించడం ప్రారంభించారు. దాంతో అంతకు ముందు లేని రీతిలో మహిళలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. ఇటీవల ఒక టీచర్ స్కర్ట్ వేసుకొచ్చినపుడు కూడా దానిపై పెద్ద గొడవే జరిగింది. దాని వల్ల పిల్లల దృష్టి మళ్లుతుందని సంప్రదాయవాదులు వాదిస్తున్నారు. అయితే జెరె తన పాటలో మహిళలకు సమానత్వం కావాలంటూ సమాజంలోని ద్వంద్వ ప్రమాదాలను ఎండగట్టారు. మేం ఏం వేసుకోవాలో ఏం చేయాలో మాకు చెప్పొద్దు అని జెరె తన పాటలో కోరారు. ‘నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఎందుకు జీవించలేను’ అని జెరె ప్రశ్నిస్తున్నారు. ‘నేనూ మనిషినే, నాకూ స్వేచ్ఛ కావాలి.. నేను నిన్ను గౌరవించేటప్పుడు, నీవూ నన్ను గౌరవించాల్సిందే’ అంటున్నారు. తన పాటలో ఆమె సంప్రదాయాలను, మతపరమైన ఆంక్షలను ఎండగట్టారు. స్త్రీ-పురుషుల విషయంలో వివక్షలే తనను ఆ పాట రాసేందుకు పురిగొల్పాయని జెరె బీబీసీతో అన్నారు. అయితే పాట విడుదలైన రెండో రోజునుంచే సోషల్ మీడియాలో ఆమెపై దాడి మొదలైంది. ఈ మ్యూజిక్ వీడియో తొలగించి, కిర్గిజ్ ప్రజలకు క్షమాపణ చెప్పకుండే నిన్ను తొందరలోనే చంపేస్తాం అంటూ ఆమెకు మెసేజ్‌లు వస్తున్నాయి. అయితే తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని జెరె అంటున్నారు. తన పాట వల్ల మహిళల స్వేచ్ఛ, సంప్రదాయాలపై చర్చ ప్రారంభమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె బీబీసీకి తెలిపారు. తాను ఒక సామాజిక కార్యకర్తనని, సమాజంలో చర్చను లేవదీయడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. తాను బ్రా వేసుకుని పాట పడడం తన తల్లిదండ్రులకు కూడా నచ్చలేదని, అయినా ఒక వ్యక్తిగా తనకు నచ్చిన పని చేసే హక్కును తనకు వారు ఇచ్చారని ఆమె తెలిపారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) మధ్య ఆసియాలోని కిర్గిస్తాన్ సింగర్ జెరె అసిల్‌బెక్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. | |