BUFFET / xlsum /telugu /xlsum_1_100_dev.tsv
akariasai's picture
Upload 147 files
2fbc8cc
text: రక్షణ శాఖ వెబ్‌సైట్‌లోని ‘వాట్స్ న్యూ’ విభాగంలో ఈ పత్రాన్ని మొదట పెట్టారు. కానీ, ఇప్పుడు అది అందుబాటులో లేదు. ‘‘మే 5 నుంచి వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద, ప్రధానంగా గల్వాన్ లోయ్ వద్ద చైనా అతిక్రమణలు క్రమంగా పెరుగుతున్నాయి. మే 17, 18న కుంగ్రంగ్ నాలా, గోగ్రా, ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర ఒడ్డు వద్ద చైనా పక్షం అతిక్రమణలకు పాల్పడింది’’ అని ‘చైనీస్ అగ్రెషన్ ఆన్ ఎల్‌ఏసీ’ శీర్షికతో ప్రచురితమైన ఆ పత్రంలో ఉంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు రెండు దేశాల సైన్యాల మధ్య సంప్రదింపులు జరిగాయనీ అందులో పేర్కొన్నారు. ఈ విషయమై జూన్ 6న రెండు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్‌ల స్థాయిలో చర్చలు జరిగాయి. అయినా, జూన్ 15న రెండు దేశాల సైనికుల మధ్య గల్వాన్ లోయ వద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రెండు వైపులా సైనికులు మరణించారు. ‘‘తూర్పు లద్దాఖ్‌లో చైనా ఏకపక్షంగా అతిక్రమణలకు పాల్పడుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఈ ప్రాంతంలో నిత్యం ఆందోళనకర పరిస్థితి ఉంటోంది. అందుకే, ఇక్కడ మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వేగంగా చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని ఆ పత్రం పేర్కొంది. రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఆ పత్రం అందుబాటులో లేదు రాహుల్ విమర్శల దాడి గురువారం ఉదయం నుంచి ఈ పత్రం వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. ఈ వార్త బయటకు రాగానే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ... మోదీ ప్రభుత్వంపై ట్విటర్‌లో విమర్శల దాడి చేశారు. ‘‘ప్రధాన మంత్రి అబద్ధం ఎందుకు చెప్పారు?’’ అంటూ ప్రశ్నించారు. ‘‘చైనాపై ఎదురుదాడి సంగతి పక్కనపెట్టండి, ప్రధాని కనీసం ఆ దేశం పేరెత్తే సాహసం కూడా చేయడం లేదు. చైనా మన మాతృభూమిపైకి వచ్చిందన్న విషయాన్ని నిరాకరించినంత మాత్రాన, వెబ్‌సైట్ నుంచి పత్రం తొలగించినంత మాత్రాన వాస్తవాలు మారవు’’ అని రాహుల్ విమర్శించారు. భారత్-చైనా సరిహద్దు వద్ద కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు సైనికపరంగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. అయితే, వీటి వల్ల ఇంతవరకూ పెద్దగా చెప్పుకోదగ్గ ఫలితాలేమీ రాలేదు. గత ఆదివారం భారత్, చైనాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చలూ ఏ నిర్ణయం లేకుండానే ముగిశాయి. ఇంతకుముందు ఉద్రిక్తతలు చెలరేగిన ప్రాంతాల నుంచి సైనికుల ఉపసంహరణ గురించి భారత్, చైనా ఇచ్చిన ప్రకటనల్లోనూ వైరుధ్యం కనిపించింది. వివాదాలున్న ప్రాంతాల్లో చాలా వాటి నుంచి సైన్యం ఉపసంహరించుకున్నట్లు చైనా ప్రకటించింది. మరోవైపు ఈ దిశగా కొంత పురోగతి కనిపించిందని భారత్ వెల్లడించింది. చైనాతో సరిహద్దు వివాదం విషయంలో మొదటి నుంచి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. చైనా విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ‘పిరికిపంద వైఖరి’ కారణంగా దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. చైనాతో ఉద్రిక్తతల విషయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ విమర్శలు చేశారు. ‘‘ఈ అంశం (భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు) పరిష్కారమవ్వాలి. కానీ, అది ఎంతవరకూ జరుగుతుందనే విషయంలో నేను ఏ గ్యారంటీ ఇవ్వలేను. భారత్‌కు చెందిన భూభాగంలో ఒక ఇంచును కూడా ప్రపంచంలోని ఏ శక్తీ తాకలేదని, ఆక్రమించలేదని మాత్రం భరోసా ఇవ్వాలనుకుంటున్నా’’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ వ్యాఖ్యలనూ రాహుల్ తప్పుపట్టారు. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) ‘లద్దాఖ్‌లో మే నెల ఆరంభంలో చైనా సైన్యం సరిహద్దుల అతిక్రమణకు పాల్పడింది’ అని అంగీకరిస్తూ భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో మంగళవారం ఓ పత్రం ప్రచురించారు. అయితే, రెండు రోజుల వ్యవధిలోనే దాన్ని తొలగించారు.